వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తన భార్య షర్మిలతో కలిసి ఆమె భర్త అనిల్ కూడా ఢిల్లీకి వచ్చారు. ఆమెతోపాటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వేదికపైన రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, ఆమె పక్కన భర్త అనిల్ వరుసగా ఆశీనులయ్యారు.
ఈ సందర్భంగా మొదట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. వైఎస్ షర్మిల మెడలా కాంగ్రెస్ కండువాను వేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా షర్మిల మెడలో కండువాను వేసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే .. షర్మిల భర్త అనిల్ మెడలో కాంగ్రెస్ కండువా వేయడానికి ప్రయత్నించగా ఆయన నవ్వుతూ సున్నితంగా తిరస్కరించారు.
'ఏం అవుతుంది.. ఫరవాలేదు' అన్నట్టుగా మల్లికార్జున ఖర్గే మరోసారి కండువా వేయడానికి ప్రయత్నించగా షర్మిల నవ్వుతూ 'ఆయనకు రాజకీయాలు ఆసక్తి లేదు' అన్నట్టు ఖర్గేకు చెప్పారు. దీంతో ఖర్గే తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాగా బ్రదర్ అనిల్ కుమార్ తెర వెనుక రాజకీయాలు నడపడంలో సిద్ధహస్తుడిగా చెబుతారు. 2019 ఎన్నికల ముందు క్రిస్టియన్లను వైసీపీ వైపు మళ్లించడంలో ఆయనదే కీలకపాత్ర అని చెబుతుంటారు. 2019 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు క్రిస్టియన్ సంఘాలతో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. తన బావమరిది వైఎస్ జగన్ కి మద్దతుగా ప్రచారం చేశారు. క్రిస్టియన్లను పూర్తి స్థాయిలో వైసీపీ వైపు మళ్లించడంలో విజయవంతమయ్యారు.
ఇక ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో బ్రదర్ అనిల్ కూడా వచ్చే ఎన్నికల్లో క్రిస్టియన్ సంఘాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుపు తిప్పే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇది వైసీపీలో ఆందోళన పెంచుతుందని అంటున్నారు. వైసీపీకి క్రైస్తవులు అతిపెద ఓటు బ్యాంకుగా ఉన్నారు. గతంలో ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవి. ఇప్పుడు షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ కు గట్టి వ్యక్తి దొరకడంతో ఈసారి క్రిస్టియన్లలో చీలిక వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Editor
Shakir Babji Shaik
BABJI GROUP'S
The largest media house