వద్ధిపర్రు గ్రామంలో బైబిల్ మిషన్ చర్చ్ తగలివేత.. మద్దతుగా నిలిచిన దళిత సంఘాలు


డా.బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వద్దుపర్రు గ్రామంలో కాలువ రేవు ప్రక్కన గత 12 సంవత్సరాలుగా పాస్టర్ రెవరెండ్ దాసరి మోజేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బైబిల్ మిషన్ భేతెస్తే స్వస్థత శాలపై కొంతమంది దుండగులు ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మందిరములోనికి ప్రవేశించి, విలువైన వస్తు సామాగ్రిని ధ్వంసం చేసి సుమారు మూడు లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ధ్వంసం చేసి మందిరంలోపల పాత ఎక్సెల్ బండిని ఉంచి నిప్పంటించడం జరిగింది.


దీనితో మందిరం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమై బూడిద పాలయింది. ఈ విషయం తెలుసుకున్న ఆత్రేయపురం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులందరూ అక్కడకు చేరుకుని ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని, ఈ దాడిలో నష్టపోయిన పాస్టర్ మోజేష్ ని అన్ని విధాలుగా ఆదుకోవాలని నినాదాలు చేస్తూ, స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పత్రాన్ని అందించడం జరిగింది. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలన్నీ అక్కడకు చేరుకుని పాస్టర్లకు మద్దతు తెలియజేశారు. ఈ విషయంలో ఎవరి పాత్ర ఉన్నను ఎంతటి వారైనను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల పాస్టర్ కి న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.